తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ 'మిషన్ శక్తిశాట్'కు ఎంపికై రాష్ట్రానికి గుర్తింపు తెచ్చారు. ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జెస్సీ, మిషన్ శక్తిశాట్ డైరెక్టర్ శ్రీమతి కేశన్‌తో కలిసి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయనను కలిశారు.

భారతదేశం నుంచి ఈ ప్రాజెక్టుకు ఎంపికైన 20 మంది బాలికల బృందంలో జెస్సీ చోటు దక్కించుకున్నారు. ఏడో తరగతి నుంచి అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచుకున్నానని, పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా చేసిన ప్రయోగాలు తనకు ఎంతో సహాయపడ్డాయని జెస్సీ తెలిపారు. ఈ మిషన్ కోసం ఆమె 550 సెషన్లు, 21 మాడ్యూల్స్‌లో శిక్షణ పొందారు.

జెస్సీని అభినందించిన మంత్రి లోకేష్, రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న 22 క్లస్టర్లలో స్పేస్ సిటీ క్లస్టర్ ఒకటని గుర్తుచేశారు. అంతరిక్ష రంగంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ, భవిష్యత్తులో జెస్సీకి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం మిషన్ శక్తిశాట్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనే లక్ష్యంతో ఉన్న జెస్సీ, భారత్ నుంచి ఎంపికైన వారిలో ఏపీ నుంచి ఉన్న ఏకైక విద్యార్థిని కావడం విశేషం.