ఉత్తర్‌ప్రదేశ్‌లోని హస్తినాపూర్‌కు చెందిన అతుల్ పంవార్ (35) జులై 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతుల్ భార్య దామిని (30), ప్లే స్కూల్ వ్యాన్ డ్రైవర్ తుషార్ అలియాస్ నిక్కీతో కలిసి ఈ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. అతుల్ పేరు మీద ఉన్న రూ. 20 లక్షల బీమా సొమ్మును కాజేయడమే లక్ష్యంగా వారు ఈ కుట్ర చేశారు.
ఘటన జరిగిన రాత్రి దామిని తన భర్త అతుల్‌కు పాలలో అధిక మోతాదులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతను గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత, తుషార్ తన సహచరులు సోను, ఉదయ్ కుమార్‌లతో కలిసి ఇంటికి వచ్చి అతుల్ దుప్పట్లో పామును వదిలాడు. పాము కాటుతో అతుల్ మరణించగా, మరుసటి రోజు ఉదయం దామిని అతడిని హస్తినాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించింది. అయితే అప్పటికే అతుల్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
మంచంపై పాము కనిపించడం, కుటుంబ సభ్యుల అనుమానాలతో పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. సీనియర్ పోలీసు అధికారి అభిజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, పాము ప్రవర్తన సాధారణ ఘటనలకు భిన్నంగా ఉండటంతో పోలీసులకు మొదట్లోనే అనుమానం కలిగింది. కాల్ డేటా, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా దామిని, తుషార్ మధ్య ఉన్న సంబంధం బయటపడింది.
తుషార్ మొబైల్ ఫోన్‌లో పాము ఫోటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 20 రోజుల క్రితం తుషార్ కారుతో అతుల్‌ను ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించినట్లు కూడా విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం నిందితులందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, ఘటనా స్థలంలో దొరికిన పామును, మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.







