మంగళవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలే ధర్మాసనం ఈ కేసును విచారించింది. భర్త రాజా రఘువంశీపై దాడి జరిగిన సమయంలో సోనమ్ ప్రవర్తన ఎలా ఉందో వివరించాలని ఆమె తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. నిందితురాలు లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించే అవకాశం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

మేఘాలయ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, హనీమూన్ కోసం వెళ్లిన రాజాను సోనమ్ కుట్ర పన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిందని తెలిపారు. ఆమె ప్రియుడు పంపిన ముగ్గురు వ్యక్తులు రాజాను హత్య చేసి, మృతదేహాన్ని లోయలో పడేశారని దర్యాప్తులో తేలిందని ఆయన వివరించారు. హత్య తర్వాత సోనమ్ అక్కడి నుంచి పరారై, చివరకు ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో పోలీసులకు లొంగిపోయిందని పేర్కొన్నారు.

సోనమ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఈ కేసును మీడియా అతిగా ప్రచారం చేస్తోందని, ఇది కేవలం పరిస్థితుల ఆధారంగా నడుస్తున్న కేసని వాదించారు. బెయిల్ మంజూరు చేసే సమయంలో అరెస్ట్ మెమోలోని చిన్నపాటి పొరపాటును హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడంపై కూడా సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలపై ప్రస్తుతానికి చర్చించబోమని స్పష్టం చేసిన ధర్మాసనం, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.