జులై 12న త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం, చెన్నంపల్లి గ్రామాల మధ్య ఉన్న పొలంలో నారు వెంకట రామిరెడ్డి మృతదేహం లభ్యమైంది. మొదట మద్యం సేవించి మృతి చెంది ఉంటాడని భావించిన పోలీసులు, దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, దర్యాప్తులో లభించిన ఆధారాలతో ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు గుర్తించారు.
మృతుడు వెంకట రామిరెడ్డి తన అప్పులు తీర్చుకునేందుకు బావ దేసిరెడ్డి వీరారెడ్డిని రూ. 10 లక్షలు సాయం కోరాడు. తన ఆస్తులు, డబ్బు నష్టం జరుగుతుందని భావించిన వీరారెడ్డి, బామ్మర్దిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రామిరెడ్డిని పొలం వద్దకు పిలిపించి, మద్యం సేవించిన అనంతరం ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. మరణం సహజంగా జరిగినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని బోర్లా పడుకోబెట్టి నిందితులు పరారయ్యారు.
ఈ కేసులో దేసిరెడ్డి వీరారెడ్డితో పాటు చిలకల అక్కిరెడ్డి, దేసిరెడ్డి నాగ అంజిరెడ్డి, తోకల చిన్న మూర్తయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 8న ప్రధాన నిందితుడు వీరారెడ్డిని, మరుసటి రోజు మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.
ఈ హత్యలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.








