రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం భారీ ఆందోళన జరిగింది. కావలి నుంచి కందుకూరు వరకు పార్టీ శ్రేణులు, రైతులు, యువత భారీ బైక్ ర్యాలీగా పోర్టు వద్దకు చేరుకున్నారు. అయితే, పోర్టుకు కిలోమీటరు దూరంలోనే పోలీసులు టిప్పర్లు, బారికేడ్లతో మార్గాన్ని మూసివేసి వారిని అడ్డుకున్నారు.

పోర్టు లోపలికి వెళ్లేందుకు అనుమతించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బుర్రా మధుసూదన్‌ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పోలీసులతో వాదించారు. పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, తాము పోర్టు పరిస్థితిని చూసే హక్కు కలిగి ఉన్నామని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగి, గంటన్నర పాటు ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో, జాతీయ రహదారి 16పై రాస్తారోకోకు దిగిన నేతలను పోలీసులు ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గుడ్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించినందుకు కాకాణి, బుర్రా, ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, రూ. 5 వేల కోట్ల విలువైన పోర్టును రూ. 1,500 కోట్లకే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను చౌకగా తెగనమ్మి, తన కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన విమర్శించారు. నిర్మాణం దాదాపు పూర్తయిన దశలో ఉన్న పోర్టును బినామీలకు అప్పగించడంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.