మయన్మార్ దేశంలోని సాగైంగ్ రీజియన్‌లోని స్వెల్ లే ఓహ్ గ్రామంలో ఉన్న బౌద్ధ మఠంపై శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సైన్యం వైమానిక దాడి చేసింది. ఫైటర్ జెట్ (యుద్ధ విమానం) ద్వారా 15 నిమిషాల వ్యవధిలో రెండు బాంబులను మఠంపై వేయడంతో 14 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. బౌద్ధుల పవిత్ర కాలమైన లెంట్ సందర్భంగా ఈ మఠంలో వారం రోజుల పాటు ధ్యాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వంద మందికి పైగా పాల్గొన్న సమయంలోనే సైన్యం ఈ దాడికి పాల్పడింది.
ఈ మఠం మాండలే నగరానికి పశ్చిమాన సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయాంగ్ టౌన్‌షిప్‌లో ఉంది. బాంబుల ధాటికి మఠం ప్రాంగణం పూర్తిగా నేలమట్టమైందని మయాంగ్ టౌన్‌షిప్‌కు చెందిన సివిల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ (పౌర రక్షణ మరియు భద్రతా సంస్థ) ప్రతినిధి న్వేవో వెల్లడించారు.
మయన్మార్‌లో 2021 ఫిబ్రవరిలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ బలగాలకు మధ్య నిరంతరం పోరాటాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సైన్యం తరచుగా వైమానిక దాడులకు పాల్పడుతోంది.
ప్రజాస్వామ్య అనుకూల శక్తులను, జాతి ఆధారిత సాయుధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైన్యం దాడులు చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ దాడుల్లో తరచుగా సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








