వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు, అధికారుల సమక్షంలోనే ఆయన మంత్రిని ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు.

ప్రభాకర్ మాట్లాడుతూ, మంత్రి గ్రామాల్లో పర్యటించడం లేదని, ముందుగా తన సొంత ఊరు, పల్లెల సమస్యలను పట్టించుకోవాలని సూచించారు. 1500 మంది జనాభా ఉన్న తన గ్రామంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆరోపించారు. సమస్యలను చెప్పుకుందామంటే మంత్రి పీఏలు ఫోన్లు ఎత్తడం లేదని, దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఆయన వాపోయారు.

తాను ఒకప్పుడు కేవలం కార్యకర్తగా ఉన్నానని, ఇప్పుడు సర్పంచ్‌గా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నానని ప్రభాకర్ గుర్తు చేశారు. మంత్రి మళ్లీ గ్రామానికి ఎప్పుడు వస్తారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది.