తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకోగా, ఆ మైలురాయిని గడువు కంటే ముందే పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. విదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకునే ప్రత్యేక కార్యాలయాలను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాల వల్లే ఈ స్థాయిలో అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని సీఎం తెలిపారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, ఆమ్‌జెన్, యూనిలీవర్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ కీలక కేంద్రంగా ఎంచుకున్నాయి. వినోదం, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన ఈ సంస్థల రాకతో నగరం ప్రపంచ స్థాయి వాణిజ్య, సాంకేతిక కేంద్రంగా మారుతోంది.
రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికతతో ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని, ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని సీఎం వివరించారు.
విదేశీ పెట్టుబడులు, తెలంగాణలోని స్థానిక నైపుణ్యాల కలయిక దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా గుర్తించాయని సీఎం తన ట్వీట్‌లో పేర్కొన్నారు.








