మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బుధాకుర్దు, పెర్కపల్లి పంచాయతీలకు చెందిన ఈ–పంచాయతీ ఆపరేటర్ చిందం శ్రీనివాస్, సెక్రటరీల డోంగల్స్‌ను ఉపయోగించి 29 డెత్ సర్టిఫికెట్లను స్థానికేతరులకు జారీ చేశారు. పంచాయతీల్లోని వివిధ పనుల కోసం ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ–పంచాయతీ ఆపరేటర్లను నియమించింది. వీరు ఎంపీడీవో కార్యాలయాల కేంద్రంగా ఎంపీవోల పర్యవేక్షణలో పనిచేస్తుంటారు.
సాధారణంగా పంచాయతీ పనుల కోసం డోంగల్ వాడినప్పుడు, దానికి అనుసంధానించిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. అయితే, బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో పాస్‌వర్డ్ ఆప్షన్ లేకపోవడంతో ఆపరేటర్లు సెక్రటరీల ప్రమేయం లేకుండానే సర్టిఫికెట్లను జారీ చేశారు. బుధాకుర్దు సెక్రటరీ సెలవులో ఉండగా, పెర్కపల్లి సెక్రటరీ బదిలీ కావడంతో, ఆ సమయంలో ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్న వారి డోంగల్స్‌ను ఆపరేటర్ దుర్వినియోగం చేశారు.
కొంతమంది నాయకులు ఆపరేటర్లను ప్రలోభపెట్టి ఈ సర్టిఫికెట్లు పొందినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నలుగురు సెక్రటరీలపై సస్పెన్షన్ వేటు వేశారు. సెక్రటరీల ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికీ, ఆపరేటర్ల చేతిలో డోంగల్స్ ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు వాపోతున్నారు.
ఈ ఘటనకు కారణమైన ఆపరేటర్ చిందం శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ–పంచాయతీ వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆపరేటర్ల దగ్గర ఉన్న డోంగల్స్‌ను వెంటనే సెక్రటరీలకు అప్పగించాలని బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.







