మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన నేరం ఏమిటని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీలో ఉండటం, గతంలో మంత్రిగా పనిచేయడమే ఆయన చేసిన తప్పా అని నిలదీశారు. వెనుకబడిన వర్గాల నుంచి ఎదిగిన సీదిరి అప్పలరాజు, మత్స్యకారుల కోసం పోరాడుతుండటంతోనే టీడీపీ ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేస్తోందని ధర్మాన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎప్పుడూ మత్స్యకారులకు సీట్లు ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య, గుంటూరులో మహిళపై జరిగిన ఘటనలు రాష్ట్ర పరువు తీశాయని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించడం మానేసి, కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను వేధించడమే పోలీసుల పనిగా మారిందని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

బీసీ వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజు అరెస్టు అన్యాయమని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దళితులు, బీసీలపై జరుగుతున్న వేధింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలపై వేధింపులు ఇలాగే కొనసాగితే తీవ్రంగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు.