కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఐ మధ్య సమన్వయం లోపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సీపీఐ తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇప్పుడు అదే పార్టీ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. బీజేపీ వంటి పార్టీలను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామని చెబుతూనే, పినపాక సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ విభేదాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఉన్న గ్యాప్ ప్రధాన కారణమని స్థానిక రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మంత్రి తన అనుకూల అధికారులకు పోస్టింగ్స్ ఇప్పించారనే విమర్శలు అప్పట్లో వివాదానికి దారితీశాయి. మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని అధిష్టానం సూచించినప్పటికీ, ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదరలేదని సమాచారం.

భద్రాద్రి జిల్లాలో మంత్రి పొంగులేటి తన అనుచర వర్గాన్ని విస్తరిస్తుండటం కూడా కూనంనేని అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి వర్గానికి చెందినవారే కావడంతో, పట్టు కోల్పోతున్నామనే భావనలో సీపీఐ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. పినపాకలో కూడా సీపీఐకి, మంత్రి అనుచరుడైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావుకు మధ్య వివాదాలు నడుస్తున్నాయి.

ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, కాంగ్రెస్ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని కూనంనేని చెబుతున్నారు. అయితే, మంత్రి పొంగులేటి వర్గంతో పెరుగుతున్న పోటీ, నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణల నేపథ్యంలో ఈ మిత్రపక్షాల మధ్య వివాదం ఎటు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.