వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం మద్దతు ఇస్తుందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రకటించారు. డీసీసీ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలెక్టర్‌ను కలిసి, “గో గ్రీన్ – సేవ్ ఎన్విరాన్‌మెంట్” ప్రచారానికి సహకరించాలని కోరగా ఆమె ఈ మేరకు స్పందించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు, నదులు కలుషితం అవుతాయని, భూగర్భ జలాలు దెబ్బతింటాయని కలెక్టర్ హెచ్చరించారు. భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆమె గుర్తు చేశారు. ఈ ప్రచారంలో విద్యాసంస్థలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చురుగ్గా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
గత కొంతకాలంగా విద్యార్థులు, యువతలో పర్యావరణ స్పృహ కల్పిస్తున్నామని డీసీసీ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, ప్రజా ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ అలంకరణలకు దూరంగా ఉండి, జలాశయాలకు హాని కలగకుండా విగ్రహ నిమజ్జనం చేయాలని ఆయన ప్రజలను కోరారు.
మహబూబ్‌నగర్ జిల్లాను పర్యావరణ హిత వినాయక చవితి నిర్వహణలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, ట్రైనీ కలెక్టర్ సాయి శివాని, పలువురు కాంగ్రెస్ నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.







