ఈ నెల 16న మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో 26 ఏళ్ల భారతి ముఖి అక్కడికక్కడే మరణించింది. ఒడిశాకు చెందిన భారతి, మాదాపూర్‌లో ఉంటూ ఇనార్బిట్ మాల్‌లోని ఒక స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో తన స్నేహితురాలు పూజాతో కలిసి భోజనం కోసం ఐటీసీ కోహినూర్ వైపు వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రమాద సమయంలో కారును ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ నడుపుతున్నాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మృతికి కారణమైన సంజూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఐదు రోజుల తర్వాత స్టేషన్ బెయిల్ మంజూరు చేసి నోటీసులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ రితిరాజ్ స్పందించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం, ఈ కేసు బెయిలబుల్ (కోర్టు బయటే బెయిల్ పొందే అవకాశం ఉన్నది) కావడంతోనే నిందితుడికి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించామని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన రోజే సంజూష్‌ను అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని ఆయన వివరించారు.
సంజూష్ అరెస్ట్ విషయంలో తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని డీసీపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కోణంలోనే తాము దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.








