లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ భవిష్యవాణిని వెల్లడించారు. భక్తులు సమర్పించిన పూజలు, నైవేద్యాలకు అమ్మవారు సంతృప్తి చెందారని ఆమె తెలిపారు. పసుపు, కుంకుమలతో భక్తిశ్రద్ధలతో ఆరాధించే భక్తుల కోరికలను నెరవేర్చి, వారిని సుభిక్షంగా చూసుకుంటానని అమ్మవారు అభయమిచ్చారు.
సమాజంలో జరుగుతున్న అకృత్యాలపై మాతంగి అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. పసిపిల్లలపై జరుగుతున్న ఘోరాలు, పాపాలు పెరిగిపోవడానికి కలికాలం ప్రభావమే కారణమని ఆమె పేర్కొన్నారు. తనను ఉగ్రరూపంలో చూపిస్తున్నారని, అయితే తాను ఎల్లప్పుడూ శాంతంగానే ఉంటానని స్పష్టం చేశారు. భక్తితో ఉండేవారికి ముక్తి, శక్తి లభిస్తాయని, ప్రతి గ్రామంలో తాను ఉండి అందరినీ ఆదుకుంటానని భక్తులకు భరోసా ఇచ్చారు.
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలంటే ఐదు వారాల పాటు శాఖ పూజలు నిర్వహించాలని మాతంగి అనురాధ సూచించారు. నేరాలకు పాల్పడేవారిని, చెడు మార్గంలో వెళ్లేవారిని శిక్షిస్తానని హెచ్చరించారు. అదే సమయంలో ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలకు తమ ఆశీస్సులు ఉంటాయని వెల్లడించారు. ధర్మ మార్గంలో నడిచే భక్తులు భయపడాల్సిన అవసరం లేదని, వారికి తాను రక్షణగా ఉంటానని ఆమె భవిష్యవాణిలో తెలిపారు.








