హైదరాబాద్‌లోని లాల్ దర్వాజ్ సింహవాహిని మహాంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన రంగం కార్యక్రమం ఉత్కంఠగా సాగింది. ఈ సందర్భంగా మాతంగి అనురాధ అమ్మవారి వాక్కులను భక్తులకు వివరించారు.
ప్రస్తుత కలికాలంలో పాపాలు పెరిగిపోయాయని, పసిపిల్లలపై ఘోరాలు జరుగుతున్నాయని మాతంగి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, భక్తితో తనను ఆరాధించే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ముక్తిని ప్రసాదిస్తానని ఆమె భక్తులకు అభయమిచ్చారు. ప్రజలు చేసే పూజల వల్లే దేశం సుభిక్షంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
పసుపు కుంకుమలతో తనను ఆరాధించే వారిని కంటికి రెప్పలా కాపాడుతానని, వారి కోరికలను నెరవేరుస్తానని అమ్మవారు తెలిపారు. భక్తులు ఐదు వారాల పాటు నిష్టగా శాక పూజలు నిర్వహించాలని ఆమె సూచించారు. చెడు పనులు చేసే వారిని శిక్షిస్తామని హెచ్చరించిన ఆమె, ప్రభుత్వాలకు తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
ముందుండి నడిపించే వారికి భక్తి, ముక్తి, శక్తిని ప్రసాదిస్తానని మాతంగి అనురాధ భరోసా ఇచ్చారు. గ్రామగ్రామాన తాను కొలువుదీరి ఉన్నానని చెబుతూ, అందరినీ ఆదుకుంటానని ఆమె భక్తులకు భరోసా కల్పించారు.








