బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ 50వ జన్మదినోత్సవ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం బాసర నుంచి త్రయంబకేశ్వర్ వరకు గోదావరి నదికి ఇరువైపులా భారీ మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒకే రోజులో దాదాపు 99 లక్షల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

గోదావరి నదికి జీవం పోసే అడవులు, రైతులు, భవిష్యత్ తరాలకు వారసత్వంగా ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఎంచుకున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. నేల కోత తగ్గడం, రైతుల ఆదాయం పెరగడం, పర్యావరణ సమతుల్యత కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.

రైతులు, మహిళలు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, సాధారణ పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. గత హరితహారం స్ఫూర్తితో 3-3-3 మోడల్ ద్వారా పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా 100 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

2031 అక్టోబర్ 15న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఈ లక్ష్యాన్ని సాధించే ప్రణాళికలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం గోదావరికి తిరిగి కృతజ్ఞతలు తెలుపుతోంది.