ప్రముఖ ఆర్థిక పత్రిక ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో నికర ఆస్తి విలువ దాదాపు 1.2 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంది. 2026 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారుల జాబితాలో రొనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు.
గత ఏడాది కాలంలో రొనాల్డో వివిధ మార్గాల ద్వారా 300 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 2,500 కోట్ల రూపాయలు ఆర్జించాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్-నసర్ క్లబ్‌తో కుదుర్చుకున్న భారీ ఒప్పందం అతడి ఆదాయానికి ప్రధాన కారణం కాగా, సొంత బ్రాండ్ ఉత్పత్తులు, వ్యాపార ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా కూడా అతడికి భారీగా ఆదాయం వస్తోంది.
అర్జెంటీనా జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన లియోనెల్ మెస్సీ ఆస్తి విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు 9,150 కోట్ల రూపాయలుగా ఉంది. గత 12 నెలల్లో మెస్సీ 140 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం అమెరికాకు చెందిన ఇంటర్ మియామీ క్లబ్‌కు ఆడుతున్న మెస్సీకి, పదవీ విరమణ తర్వాత ఆ క్లబ్‌లో వాటా పొందే అవకాశం ఉంది.
మెస్సీ ఆర్థిక పునాదిలో అడిడాస్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థలతో ఉన్న లైఫ్‌టైమ్ ఒప్పందాలు, ఇతర గ్లోబల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రొనాల్డో, మెస్సీల ఆస్తుల మధ్య ప్రస్తుతం సుమారు 100 మిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది. వీరిద్దరి ఆస్తుల పరంగా చూస్తే రొనాల్డో మెస్సీ కంటే ముందు వరుసలో ఉన్నాడు.
క్రీడా రంగంలో ఆటగాళ్లు బిలియనీర్లుగా ఎదగడం చాలా అరుదు. రొనాల్డో, మెస్సీ కేవలం మైదానంలోనే కాకుండా, తమ బ్రాండ్ విలువను వ్యాపార రంగంలోకి సమర్థవంతంగా మళ్లించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే అథ్లెట్లుగా చరిత్ర సృష్టించారు.
భవిష్యత్తులో ఆటగాళ్ల మార్కెట్ విలువ, క్లబ్ ఒప్పందాలు, వ్యాపార పెట్టుబడుల ఆధారంగా ఈ ఆస్తుల గణాంకాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య మైదానంలోనే కాకుండా, సంపాదనలో కూడా పోటీ కొనసాగుతోంది.








