కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. ఈ కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులు, స్థానిక బల్దోట ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్న 22 ఎకరాల చెరువు నీటిని ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. గతంలో సారవంతమైన వ్యవసాయ భూములను ప్రభుత్వం ఈ సంస్థకు అప్పగించడాన్ని కూడా స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
మంగళవారం గవి సిద్ధేశ్వర మఠం ప్రాంగణం నుంచి ఫ్యాక్టరీ వరకు రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు ఫ్యాక్టరీ కాంపౌండ్ గోడను పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారాలను దాటి లోపలికి వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో ఆయన చర్చలు జరిపారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించారు.
అయితే, రైతుల ఆందోళనపై బల్దోట ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నిరసనకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.







