కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించేందుకు సీఎంసీ అధికారులు చేపట్టిన చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డుకు సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న చిరు వ్యాపార దుకాణాలను కూల్చివేసేందుకు అధికారులు జేసీబీ యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు.

తమ జీవనాధారమైన దుకాణాలను తొలగించవద్దని కోరుతూ స్థానికులు, మహిళలు జేసీబీకి అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈ వ్యాపారాలపైనే ఆధారపడి బతుకుతున్నామని, ఉన్నపళంగా కూల్చివేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని బాధితులు ఆవేదన చెందారు.

ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు వ్యవహరించడం సరికాదని బాధితులు వాపోయారు. పిల్లల పోషణ, తమ బతుకుదెరువు ప్రశ్నార్థకమైందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

కూల్చివేతలకు ముందు చట్టబద్ధమైన విధానాలను పాటించాలని, తగిన నోటీసులు జారీ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.