కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పి, 1000 రోజులు గడిచినా ఏ ఒక్కటి అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, బుధవారం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ నేతలు ప్రజలకు ‘బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. రైతు భరోసా, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, రూ. 2,500 మహాలక్ష్మి భృతి, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి వంటి పథకాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని వారు మండిపడ్డారు.

నిరసనలో భాగంగా పలు చోట్ల 420 అడుగుల పొడవైన భారీ ఫ్లెక్సీలను మానవ హారంగా ప్రదర్శించారు. ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై మానవ హారం నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల వివరాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు దేవాలయాల సాక్షిగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేశారని, కానీ ఇప్పుడు మాట తప్పారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విమర్శించారు. పూటకో మాట మారుస్తూ, ప్రజల కష్టాలను పట్టించుకోకుండా సీఎం ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని వారు ఆరోపించారు.

ప్రజాపాలన పేరుతో పీడిత పాలన సాగిస్తున్నారని, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ‘దోకా ప్రభుత్వం’ అని పిలుస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు.