కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా GHMCని విభజించి కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ విభజన తర్వాత తగిన మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎంఎంసీ (MMC)లో 74 వార్డులను ఏర్పాటు చేసినా, పాత డివిజన్ల సరిహద్దులను మార్చడం వల్ల నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల్లో గందరగోళం నెలకొంది.
కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. చాలా సర్కిల్స్‌లో కీలక అధికారులు లేక ఇన్‌చార్జిలతోనే పాలన సాగిస్తున్నారు. దీంతో నలుగురు చేయాల్సిన పనిని ఒక్కరే చేయాల్సి వస్తుండటంతో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.
నియోజకవర్గాల విభజన కూడా ప్రజలకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలోని యాప్రాల్ ప్రాంతాన్ని కీసర సర్కిల్‌లో చేర్చడంతో, స్థానికులు పనుల కోసం కీసర మున్సిపాలిటీకి వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి మార్పుల వల్ల సనత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ నియోజకవర్గాల్లో పాలన వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది.
పట్టణ ప్రణాళిక విభాగం గాడి తప్పడంతో అక్రమ నిర్మాణాలు పెరిగాయి. అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతుండటం, చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా, రోడ్లు గుంతలమయంగా మారినా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటి సమస్య మరింత తీవ్రమైంది. మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు ఒక్కో ట్యాంకర్ నీటి కోసం రూ.800 చెల్లించాల్సి వస్తోంది. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. కార్పొరేషన్ ఏర్పాటుతో సమస్యలు తీరాలి కానీ, కొత్త సమస్యలకు అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.








