నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వ్యసనాలకు బానిసలై, తమ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేశారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ను చంపడమే కాకుండా, ఆమె వద్ద ఉన్న డబ్బును కూడా దోచుకున్నారని, ఆ తర్వాత ఏమీ తెలియనట్లు మృతదేహం వద్దకు వచ్చారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రవీణ్‌కుమార్‌, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని, శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.

విద్య, హోంశాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నప్పటికీ, రాష్ట్రంలో పరిస్థితులు మారలేదని ప్రవీణ్‌కుమార్‌ లేఖలో వివరించారు. హైదరాబాద్‌లో కూర్చుని సమీక్షలు నిర్వహించడం కాకుండా, నేరుగా పాఠశాలలకు వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.

పాఠశాలల్లోకి గంజాయి రాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 22ఏ (ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే చట్టం) కింద భూములను నిషేధించడం కంటే, యువతను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.