కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కొమురవెల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైనులో భాగంగా ఈ స్టేషన్‌ను రూ. 6 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించారు. ఈ మార్గంలో డెము (DEMU) రైళ్లు ఇకపై కొమురవెల్లిలో ఆగుతాయి.
తెలంగాణలో రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 340 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం రూ. 48,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
ఈ స్టేషన్ అందుబాటులోకి రావడంతో భక్తులకు, స్థానికులకు ప్రయాణం సులభతరం కానుంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా షటిల్ సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. అన్‌రిజర్వ్‌డ్ టికెట్ ధరలు రూ. 25 నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.







