సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జూలై 26న జరిగిన రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్‌రావు, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు. వేదికపై ఉన్న అతిథులను రైల్వే అధికారులు సన్మానించే క్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును పిలవకపోవడం వివాదానికి దారితీసింది.
సభకు హాజరుకాని పలువురు ఎమ్మెల్సీల పేర్లను అధికారులు ప్రకటించడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అవమానించారంటూ వారు వేదిక వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు 'జై పల్లా', 'జై తెలంగాణ', 'జై కేసీఆర్' అంటూ నినాదాలు చేయగా, ప్రతిగా బీజేపీ కార్యకర్తలు 'జై భారత్' అంటూ నినాదాలు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. బీజేపీ నేతలు రైల్వే అధికారులను మందలించడంతో, వారు వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వద్దకు వెళ్లి సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు ఆపి శాంతించారు.
ఇదే కార్యక్రమంలో కొమురవెల్లి సర్పంచ్ గొల్లపల్లి పద్మాఆంజనేయులును కూడా అధికారులు విస్మరించారు. దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.








