శ్రీలంకలోని కొలంబోలో ఉన్న సింఘలీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో నవంబర్ 14న టెస్ట్ ట్వంటీ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న 160 మంది యువ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటారు.
ఈ టోర్నమెంట్లో నాలుగు కాంటినెంటల్ జట్లు పోటీ పడతాయి. ప్రతి జట్టులోనూ బాలికలు మరియు బాలుర జట్లు ఉంటాయి. వీరు షేర్డ్ స్కోరింగ్ సిస్టమ్ (ఉమ్మడి స్కోరు విధానం) ద్వారా ఆడతారు. అంటే, అమ్మాయిలు అమ్మాయిలతో, అబ్బాయిలు అబ్బాయిలతో విడివిడిగా ఆడినా, చివరకు రెండు జట్లు సాధించిన పరుగులను కలిపి మొత్తం స్కోరును బట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు.
ఈ కొత్త ఫార్మాట్లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలి మరియు బాలికల మ్యాచ్ ముందుగా జరగాలా లేక బాలుర మ్యాచ్ ముందుగా జరగాలా అనే రెండు విషయాలను టాస్ నిర్ణయిస్తుంది. అమ్మాయిలు సాధించిన పరుగులు అబ్బాయిల ఫలితంపై ప్రభావం చూపుతాయి, అలాగే అబ్బాయిల పరుగులు అమ్మాయిల ఫలితంపై ప్రభావం చూపుతాయి.
క్రికెట్ చరిత్రలో దాదాపు 150 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, టీ20 అనే మూడు ఫార్మాట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న టెస్ట్ ట్వంటీని క్రికెట్ చరిత్రలో నాలుగో ఫార్మాట్గా నిర్వాహకులు చెబుతున్నారు. దీనిని క్రికెట్లో అపూర్వమైన పరిణామంగా వారు అభివర్ణించారు.
ఈ టోర్నమెంట్ నవంబర్ 14 నుంచి 29 వరకు జరుగుతుంది. ఒకవేళ వర్షం వంటి కారణాలతో మ్యాచ్ ఆగిపోతే, నవంబర్ 30ని ఆకస్మిక రోజుగా (రిజర్వ్ డే) కేటాయించారు. శ్రీలంకలో స్కూల్ బాయ్ క్రికెట్కు సుదీర్ఘ చరిత్ర ఉంది, ఇందులో భాగంగానే 1879లో మొదలైన రాయల్-థామియన్ ఎన్కౌంటర్ 147వ ఎడిషన్ను ఈ ఏడాది మార్చిలో ఇదే SSC వేదికగా నిర్వహించారు.








