ఖమ్మం రూరల్ మండల పశువైద్యుడు అనంతుల హరీష్ శనివారం ఏదులాపురం గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం పశువులపై కనిపిస్తోందని, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు.
పశువుల కోసం మేత నిల్వలు, త్రాగునీరు, ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని హరీష్ కోరారు. ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పశువులకు చల్లని నీడ ఉండేలా షెడ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒకవేళ చూడి పశువులకు లేదా ఇతర పశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే, వెంటనే సమీపంలోని పశు వైద్యశాలను సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు.
వ్యవసాయ పరంగా మామిడి తోటల్లో అంతర పంటలుగా అలసంద, పిల్లి పెసర సాగు చేసుకోవాలని ఉద్యాన అధికారి అపర్ణ సూచించారు. ఏక వార్షిక, బహు వార్షిక పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని ఆమె కోరారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా పశు సంపదను రక్షించుకోవడంతో పాటు, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఉద్యాన అధికారి అపర్ణ, ఏఈఓ ఆదర్శ్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు మామిళ్ల శ్రీనాథ్ రెడ్డి, దండి శ్రీజ, ఊరడి హైమావతి పాల్గొన్నారు.








