వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని అంచనా. మరోవైపు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆగస్టు 18 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
గడిచిన 24 గంటల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో 43.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కురుపాం, పార్వతీపురం, పాతపట్నం ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడుతున్నప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.








