ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను కలవడం సింహం బోనులోకి వెళ్లడంతో సమానమని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ లీ ఇల్-గ్యు తెలిపారు. కిమ్‌ను కలిసే వ్యక్తులు కచ్చితంగా నెల రోజుల పాటు కఠిన శిక్షణ పొందాలని, అందులో భాగంగా ఆయనతో ఎలా మాట్లాడాలి, హావభావాలు ఎలా ఉండాలి అనే అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తారని ఆయన వెల్లడించారు. తాను కిమ్‌ను ఏడుసార్లు కలిశానని, ప్రతిసారీ ఈ శిక్షణను పూర్తి చేశానని లీ చెప్పారు.
కిమ్ సమక్షంలో చిన్న పొరపాటు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని లీ హెచ్చరించారు. కిమ్ స్వయంగా ప్రశ్న అడిగితే తప్ప అవతలి వ్యక్తి మాట్లాడకూడదు, అడిగిన ప్రశ్నకు క్లుప్తంగా సమాధానం ఇవ్వాలి. ఒకవేళ జవాబు తెలియకపోయినా లేదా తెలిసినట్లుగా నటించినా, అతిగా ప్రవర్తించినా ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. కిమ్ చుట్టూ జరిగే ప్రతి సంభాషణ రికార్డ్ అవుతుందని, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండాలని శిక్షణలో సూచిస్తారని లీ వివరించారు.
ఒక అనువాదకుడు కిమ్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడంతో అతడి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని లీ గుర్తు చేశారు. ఆ అనువాదకుడిని మర్యాద లేని వ్యక్తిగా కిమ్ అభివర్ణించగా, అతడి కుటుంబానికి ప్రభుత్వంలో పలుకుబడి ఉండటంతో తీవ్ర శిక్ష నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ తర్వాత అతడు 'విమర్శనా సమావేశానికి' హాజరై తన ప్రవర్తనపై సొంతంగా విమర్శలు రాసుకోవాల్సి వచ్చింది. కిమ్‌ను ఆకట్టుకోవడానికి పొగడ్తలు కురిపించడం లేదా ఆయన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడం కూడా తప్పేనని లీ స్పష్టం చేశారు.
కిమ్ జోంగ్ ఉన్‌లో సాధారణ మనిషి లక్షణాలతో పాటు అపార అనుభవం ఉన్న నాయకుడి లక్షణాలు కూడా ఉన్నాయని లీ గమనించారు. 2018 నవంబర్‌లో క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ ఉత్తర కొరియా పర్యటనలో కిమ్‌తో చర్చలు, అధికారిక విందు వంటి కార్యక్రమాలను లీ సమన్వయం చేశారు. అయితే, కిమ్ అధికారాన్ని సవాల్ చేసే వ్యక్తి ఉత్తర కొరియాలో ఎవరూ లేరని లీ ఇల్-గ్యు తేల్చి చెప్పారు.








