సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ వరకు సుమారు రూ. 90 కోట్ల వ్యయంతో ఈ రాజీవ్ లింక్ కెనాల్‌ను నిర్మించారు. జూలూరుపాడు మండలం వినోబానగర్ నుంచి ఏన్కూరు మండలం అక్కినాపురం తండా వరకు విస్తరించి ఉన్న ఈ కాల్వను, 2024 ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఇమామ్ నగర్ వద్ద సుమారు 20 అడుగుల మేర కాల్వ లైనింగ్ కుంగిపోగా, కాంక్రీట్ ముక్కలు విరిగి కాల్వలో పడిపోయాయి. దీనికి సమీపంలోనే ఉన్న బ్రిడ్జి పక్కన మరో 20 అడుగుల మేర లైనింగ్ పూర్తిగా పాడై, మట్టి కోతకు గురవుతోంది. తక్కువ నీటి ప్రవాహానికే కాల్వ నిర్మాణం దెబ్బతినడంపై స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.

ఈ కాల్వ సామర్థ్యం 1400 క్యూసెక్కులు (సెకనుకు ప్రవహించే నీటి పరిమాణం) అని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇటీవల గోదావరి నుంచి 1700 క్యూసెక్కుల నీటిని పంపడం వల్లే లైనింగ్ దెబ్బతిని ఉండవచ్చని వారు వివరిస్తున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ పనులు పూర్తయినా, టన్నెల్స్ (కొండలను తొలిచి నిర్మించే సొరంగాలు) నిర్మాణం పూర్తి కాలేదు. దీనివల్ల కాల్వలను ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయిందని అధికారులు పేర్కొన్నారు.