ఖమ్మం జిల్లా మధిరలో అత్యాధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) అందించిన నిధులు, ప్రభుత్వం కేటాయించిన 8,000 గజాల స్థలంలో ఈ వంటశాలను నిర్మించారు. 16 మండలాల పరిధిలోని 44,107 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ఈ వంటశాలలో ఆహారాన్ని పరిశుభ్రంగా తయారు చేసేందుకు ఆటోమేటెడ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, వారంలో మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి మాల్ట్ అందించాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత వంటశాలలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.