బ్రియాన్ మ్వెండా అనే వ్యక్తి కెన్యా హైకోర్టు న్యాయవాదిగా నటిస్తూ మేజిస్ట్రేట్లు, అప్పీల్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ముందు వాదనలు వినిపించాడు. తన వాదనలతో 26 కేసుల్లో విజయం సాధించిన ఇతను, తనపై నమోదైన కేసును కూడా స్వయంగా వాదించి గెలవడం గమనార్హం. అయితే, ఇతను అధికారికంగా న్యాయవాది కాదని గుర్తించిన అధికారులు 2023లో అరెస్టు చేశారు.
న్యాయవాదుల నమోదు, వారి వివరాలను పర్యవేక్షించే లా సొసైటీ ఆఫ్ కెన్యా (LSK) పోర్టల్‌లోకి మ్వెండా అనధికారికంగా ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది. అసలైన న్యాయవాది బ్రియాన్ మ్వెండా న్ట్విగా తన ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అందులో తనది కాని ఈమెయిల్ చిరునామా ఉండటంతో ఈ మోసం బయటపడింది. మ్వెండా తన ఫొటోను అప్‌లోడ్ చేసి, ప్రాక్టీసింగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, అవసరమైన పత్రాలు లేకపోవడంతో అది పూర్తి కాలేదు.
ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో లా సొసైటీ ఆఫ్ కెన్యాకు చెందిన ర్యాపిడ్ యాక్షన్ టీమ్ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మ్వెండా ఎటువంటి అధికారిక అర్హత లేకుండానే కోర్టుల్లో వాదించినట్లు నిర్ధారించుకున్న అధికారులు, తదుపరి విచారణ కోసం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కెన్యా న్యాయవ్యవస్థలో గుర్తింపు కార్డులు, ఆన్‌లైన్ భద్రతపై చర్చ మొదలైంది.
ఇతను గెలిచిన 26 కేసుల తీర్పులపై ఇప్పుడు చట్టపరమైన అనిశ్చితి నెలకొంది. ఈ తీర్పుల విషయంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది కెన్యా న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.








