ఇబ్రహీంపట్నం సమీపంలోని రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో ఆగస్టు 27న గుర్తుతెలియని వ్యక్తులు హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ తాళాలు పగలగొట్టి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనా స్థలంలోని సీసీ టీవీ (నిఘా కెమెరా) ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి చోరీకి పాల్పడినట్లు దృశ్యాలు కనిపించడంతో, పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో బొంగుళూర్ సమీపంలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వారు లాల్‌దర్వాజాకు చెందిన కాలీవాలా రోహిత్, అతడి తండ్రి కాలీవాలా సోమ్రాజ్ అని తేలింది.

నిందితుడు రోహిత్‌కు గతంలో కూడా పలు దేవాలయాల్లో చోరీలు చేసిన నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల నుంచి రూ.12,120 నగదుతో పాటు, కరిగించిన 90 తులాల వెండి కడ్డీని స్వాధీనం చేసుకున్నట్లు ఆదిభట్ల సీఐ రమేశ్ తెలిపారు.