కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) వంటి పోస్టులను భర్తీ చేసేందుకు SSC సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 2,536 తాత్కాలిక ఖాళీలను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అభ్యర్థులు అక్టోబర్ 7 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 8 రాత్రి 11 గంటల వరకు సమయం ఉంది. ఒకవేళ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని సరిదిద్దుకోవడానికి అక్టోబర్ 14 నుంచి 16 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 2026, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. అంటే 1999, ఆగస్టు 2 నుంచి 2008, ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. అయితే, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ (వైకల్యం ఉన్న వ్యక్తులు)కి పదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
విద్యార్హతల విషయానికి వస్తే, సాధారణ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సరిపోతుంది. కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రం గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో గణితం ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. 12వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
జనరల్, ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు), ఓబీసీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. టైర్-1, టైర్-II అనే రెండు దశల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
టైర్-1 పరీక్షలో 100 మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటిని 60 నిమిషాల్లో పూర్తి చేయాలి. టైర్-II పరీక్షను ఒకే రోజు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలోని సెక్షన్-1, సెక్షన్-2 విభాగాల్లో తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్ష తేదీలను కమిషన్ ఇంకా ప్రకటించలేదు, త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.








