ఇంటి ముందున్న వాకిలిలో కారు పార్కింగ్ చేసే యజమానులు ఏడాదికి గరిష్ఠంగా రూ. 25 వేల పన్ను చెల్లించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్ బెంగళూరు ఏరియా పార్కింగ్ రూల్స్ 2026 పేరుతో ఈ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. ఇంటి పన్ను, నీటి పన్ను, విద్యుత్ చార్జీలు సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే ఈ పార్కింగ్ అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై బెంగళూరు నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లోని ఇళ్ల ముందు కాకుండా కార్లను మరెక్కడ పార్కింగ్ చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజలపై అదనపు పన్నుల భారాన్ని మోపుతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే మద్యం, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలను ప్రభుత్వం పెంచింది. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర అప్పులు రూ. 8.24 లక్షల కోట్లకు చేరాయని గణాంకాలు చెబుతున్నాయి.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వితంతువులు, అనాథల పేరుతో ప్రత్యేక సెస్‌ను (ప్రభుత్వం విధించే అదనపు పన్ను) పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేస్తోంది. ఈ నిర్ణయంపై పెట్రోలియం డీలర్ల సంఘం ఇప్పటికే నిరసన వ్యక్తం చేసింది. గ్యారెంటీల అమలు కోసం అప్పుల బాట పట్టిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.







