మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ బీమా కుంభకోణం బయటపడింది. సాధారణంగా మరణించిన కార్మికుడికి సంబంధించి ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టు, డెత్ సర్టిఫికెట్ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉండగా, వీటి స్థానంలో ఏమీ లేని తెల్ల కాగితాలను మీ సేవ (ప్రభుత్వ సేవలు అందించే కేంద్రం) ద్వారా అప్‌లోడ్ చేసి నిధులు డ్రా చేశారు.

మంచిర్యాల జిల్లాలో 84 మంది క్లెయిమ్‌లలో 74 మందికి సంబంధించిన పత్రాలు అసలు లేవని ఆర్టీఐ (ప్రభుత్వ సమాచారాన్ని అడిగి తెలుసుకునే హక్కు) దరఖాస్తు ద్వారా బయటపడింది. అంగవైకల్యం విషయంలో కూడా మెడికల్ బోర్డు ఇచ్చే సదరం సర్టిఫికెట్ వంటి ఆధారాలు లేకుండానే గత ఆరు నెలల్లో వందకు పైగా బోగస్ క్లెయిమ్‌లను అధికారులు మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో ఏఎల్‌వో, ఏసీఎల్‌లుగా పనిచేసిన ఇద్దరు అధికారులు ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మంత్రి కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే ఈ అవినీతి జరగడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ కుంభకోణంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.