కందుకూరు నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మానుగుంట మహీధర్ రెడ్డి, గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, రాబోయే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వకపోయినా, ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
మహీధర్ రెడ్డికి సన్నిహితంగా ఉండే మండల స్థాయి వైసీపీ నేతలు, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కలిసి ఆయన తిరిగి క్రియాశీలకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అయితే, కందుకూరు నియోజకవర్గం నెల్లూరు లోక్‌సభ పరిధిలోకి వస్తుండటంతో, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవాలని బూచేపల్లి సూచించారు. దీంతో మహీధర్ రెడ్డి సన్నిహితులు కాకానిని కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.
మరోవైపు, ఈ పరిణామాలను కందుకూరు వైసీపీ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం నిశితంగా గమనిస్తోంది. గత ఎన్నికల్లో మహీధర్ రెడ్డి వర్గం తమకు సహకరించలేదని ఆరోపిస్తున్న బుర్రా అనుచరులు, ఇప్పుడు ఇలాంటి ప్రచారం చేయడం వల్ల పార్టీ కేడర్‌లో అయోమయం ఏర్పడుతుందని మండిపడుతున్నారు. ప్రస్తుతం బుర్రా మధుసూదన్ యాదవ్ మరియు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మధ్య పోటీ నడుస్తుండగా, ఈ కొత్త పరిణామాలు నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచాయి.
ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. మహీధర్ రెడ్డి మాత్రం ఈ పరిణామాలతో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిజంగానే వైసీపీలో తిరిగి యాక్టివ్ అవుతారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.








