కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటిని పంపింగ్ చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు లేఖ రాశారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రస్తుతం ఎలినినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నాయని, ప్రాజెక్టుల్లో నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారని హరీష్‌రావు పేర్కొన్నారు. మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 22 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ఈ నీటిని వినియోగించుకుని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లతో పాటు చెరువులు, చెక్ డ్యామ్‌లను నింపాలని ఆయన కోరారు. దీనివల్ల 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు.

అంతేకాకుండా, 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండి)లో ప్రస్తుతం 6.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని హరీష్‌రావు గుర్తుచేశారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని తరలించి, ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్-2 ఆయకట్టుకు సాగునీరు అందించడం ద్వారా రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.