కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది ప్రకృతి సిద్ధమైన కరువు కాదని, ప్రభుత్వం తెచ్చిన కరువని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడు మోటర్లు ఆన్ చేస్తే ప్రజలు నమ్మరని భయపడుతోందని విమర్శించారు.
గోదావరిలో ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా, వరంగల్, నల్లగొండ జిల్లాలకు మాత్రం నీరు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఖర్చవుతుందనో లేదా కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనో భావించి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద మోటర్లను వెంటనే ఆన్ చేసి పంట పొలాలకు నీరు అందించాలని, లేనిపక్షంలో సూర్యాపేట నుంచి ప్రజలు, రైతులు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.
హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే బుల్లెట్ ట్రైన్ రూట్ మార్పుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ మీదుగా ఈ రైలు వెళ్తుందని చెబుతూ, ఇప్పుడు రూట్ మారుస్తామనడం సరికాదని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయవద్దని, ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించేందుకు స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు కృషి చేయాలని, బీఆర్‌ఎస్ కూడా సహకరిస్తుందని ఆయన తెలిపారు.








