శనివారం ఉదయం 6.16 గంటల నుంచి 6.45 వరకు తమ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పనిచేయలేదని అభిజీత్ దీప్కే తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇలా జరగడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తున్న సమయంలోనే ఖాతా నిలిచిపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని హింగోలి జిల్లా, సంతుక్ పింప్రీ గ్రామం నుంచి అభిజీత్ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు భారీ ప్రచార బ్యానర్ల కోసం ఖర్చు చేసే నిధులను, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు దాటినా, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై తల్లిదండ్రులు, గ్రామస్థులు ప్రభుత్వాలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అభిజీత్ తెలిపారు. ఈ బృందాలు వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ప్రజలను అప్రమత్తం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.







