అసాధారణ ప్రతిభ గల వ్యక్తులు, ప్రఖ్యాత పరిశోధకులు, ప్రొఫెసర్లు మరియు బహుళజాతి సంస్థల మేనేజర్లకు ఇచ్చే ఉపాధి ఆధారిత మొదటి ప్రాధాన్యత వీసా (EB-1) భారతీయులకు తాత్కాలికంగా అందకపోవచ్చు. ఈ విభాగంలో భారత్ నుంచి దరఖాస్తులు భారీగా పెరగడం, వీసాల వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణమని అమెరికా విదేశాంగ శాఖ సెప్టెంబర్ వీసా బులెటిన్‌లో పేర్కొంది.

అమెరికా ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఈ గడువు ముగిసేలోపే భారత్‌కు కేటాయించిన కోటా పరిమితి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రానున్న వారాల్లో భారతీయులకు ఈ వీసా విభాగం అందుబాటులో లేకుండా చేయాల్సి రావచ్చని విదేశాంగ శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన మార్పులు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఈ విభాగంలో భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు వేచి చూస్తున్నారు. ఈ పరిణామంతో వారికి మరో వీసా మార్గం మూసుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

అమెరికా వలస చట్టం ప్రకారం, ఉపాధి ఆధారిత వీసాలలో ఒక్కో దేశానికి 7 శాతం గరిష్ఠ పరిమితిని అమలు చేస్తారు. అయితే క్యారీఓవర్ నిబంధనల ద్వారా సర్దుబాట్లు ఉంటాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి ఆధారిత వీసాల గరిష్ఠ పరిమితిని 1,86,317గా నిర్ణయించారు.

మరోవైపు, విదేశీ వలసదారుల పిల్లలకు అమెరికాలో పుట్టినంత మాత్రాన పౌరసత్వం లభించే హక్కును పరిమితం చేయాలని ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు జన్మతః పౌరసత్వంపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వులను కోర్టు నిలిపివేసింది.