ఏడు టీఎంసీల సామర్థ్యం ఉన్న కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం 3.495 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచగలుగుతున్నారు. ప్రాజెక్టు ఎగువన దాదాపు 18 కిలోమీటర్ల మేర పూడిక పేరుకుపోవడమే ఈ నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరినప్పటికీ, నిల్వ సామర్థ్యం లేకపోవడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేశారు.
ఈ పూడికను తొలగించే పనులను రాజస్థాన్‌కు చెందిన ఈతర్ (Ether) అనే కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. 20 ఏళ్ల పాటు ఈ పనులు చేసేలా ఏడాది క్రితమే ఒప్పందం కుదిరింది. టన్ను పూడిక మట్టికి 407 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని ఈతర్ కంపెనీకి కేటాయించకపోవడంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
ప్రాజెక్టు సమీపంలోని ఎర్వచింతల, రేవోజిపేట, సోమవార్ పేట గ్రామాల్లో భూములను అధికారులు గుర్తించినా, అవి కంపెనీకి అందలేదు. 100 ఎకరాల్లో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసి, పూడిక నుంచి ఇసుక, మట్టిని వేరు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సమస్య వల్ల వానాకాలం చివరలో, రబీ సీజన్‌లో 68 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, పూడిక సమస్యపై అధికారులను ఆరా తీశారు. వెంటనే పూడికతీత పనులను ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకునైనా పనులు త్వరగా మొదలవుతాయని రైతులు ఆశిస్తున్నారు.







