కడప జిల్లా గోపవరం మండలం రామిరెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లెం కొండయ్య, మధ్యాహ్నం సమయంలో పాఠశాల సమీపంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఒక సంచిలో కట్టెలు, పెట్రోల్ బాటిల్‌ను తీసుకురావడం గమనించిన విద్యార్థులు, ఆ తర్వాత జరిగిన ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో కొండయ్య అక్కడికక్కడే మరణించారు. ఈ విషయాన్ని విద్యార్థులు వెంటనే తోటి ఉపాధ్యాయులకు తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
మృతుడు గోపవరం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వ్యక్తి కాగా, ప్రస్తుతం బద్వేల్ టౌన్‌లో నివసిస్తున్నారు. ఆయనకు పదవ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.








