ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా, ఓం నగర్ ఉర్లా ప్రాంతంలో గత ఏడాది ఏప్రిల్ నెలలో ఈ దారుణం జరిగింది. పండుగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారి సాయంత్రానికి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోవడంతో మోహన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, సమీపంలోని కారు డిక్కీలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. బాలిక పెదవుల నుంచి రక్తం కారుతుండటం, ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పరీక్షలో చిన్నారిపై అత్యాచారం జరిగిందని, ఆ తర్వాతే హత్య చేశారని తేలింది.

నిందితుడు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు బాలిక మర్మాంగాలపై టాయిలెట్ క్లీనర్ పోశాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితుడు ప్రయత్నించినప్పటికీ, విచారణలో బాలిక మేనమామ సోమేష్ యాదవ్ ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, బాలలపై లైంగిక నేరాల చట్టం (POCSO) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోసం దుర్గ్ జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలోనే విచారణ పూర్తి చేసేందుకు ఈ కోర్టు పనిచేసింది.

కేవలం 17 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసిన అడిషనల్ సెషన్స్ జడ్జి అనిష్ దూబే, ఈ కేసును అత్యంత అరుదైన ఘటనగా పరిగణించారు. నిందితుడు సోమేష్ యాదవ్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.