తెలంగాణ అసోసియేషన్ ఎన్‌ఆర్‌ఐ హ్యాంబర్గ్ (TANH) ఆధ్వర్యంలో జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను హ్యాంబర్గ్‌లో జరపడం ఇదే మొదటిసారి.

ఈ వేడుకలో భాగంగా మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు బోనాలను సమర్పించారు. డప్పుల దరువులు, లాస్య నృత్యాలతో వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. కుటుంబ సమేతంగా హాజరైన తెలంగాణ సముదాయం సభ్యులు ఈ సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొని తమ మూలాల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు.

భారతీయతను, తెలంగాణ సంస్కృతిని, భక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలనే సందేశంతో TANH ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పండుగ కార్యక్రమం ఆద్యంతం భక్తిపూర్వకంగా కొనసాగింది.