అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యన్ వ్యోమగాములు భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ, రెండు దేశాల మధ్య అంతరిక్ష పరిశోధనల్లో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేశారు. వ్యోమగామి ప్యోట్ర్ డుబ్రోవ్ తన సందేశంలో భారత దేశం శాంతి, సంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
మాస్కో మరియు న్యూఢిల్లీ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సహకారాన్ని వ్యోమగాములు ప్రస్తావించారు. 1975లో సోవియట్ యూనియన్ సహకారంతో భారత్ తన మొదటి ఉపగ్రహం 'అర్యభట్ట'ను ప్రయోగించినప్పటి నుంచి ఈ బంధం మొదలైంది. 1984లో రాకేశ్ శర్మ సోవియట్ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడిగా నిలిచారని వారు గుర్తు చేశారు.
ప్రస్తుతం భారత్ చేపట్టిన 'గగన్‌యాన్' అంతరిక్ష యాత్రలో కూడా రష్యా సహకారం కొనసాగుతోంది. భారత వ్యోమగాములు రష్యాలోని యూరి గాగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారు. రోస్కాస్మాస్, ఇస్రో సంస్థల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం అంతరిక్ష పరిశోధనల్లో కొత్త దశకు చేరుకుందని వ్యోమగామి అన్నా కికినా పేర్కొన్నారు.
యూరి గాగారిన్ 1961 నవంబర్‌లో భారత్‌ను సందర్శించినప్పటి నుంచి భారత ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని వ్యోమగాములు గుర్తు చేశారు. అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు భారత్ ఎంతో అందంగా కనిపిస్తుందని గాగారిన్ గతంలో పేర్కొన్న విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.






