మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి గురువారం జనవాడ గ్రామంలో నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో, CSR నిధుల ద్వారా రూ. 5 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. గతంలో ఈ పాఠశాల భవనం కూలిపోయే స్థితిలో ఉండగా, ఆ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించారని సబితాఇంద్రారెడ్డి గుర్తు చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తుల తరఫున కేటీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ జనవాడ స్కూల్ ఒక రోల్ మోడల్‌గా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. విద్యార్థులు ఈ వనరులను సద్వినియోగం చేసుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

ఈ పాఠశాలను దత్తత తీసుకున్న ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన గౌడిచర్ల వెంకటేశ్ పనితీరును ఆమె అభినందించారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉంటుందని, ప్రతి విద్యార్థి పరిస్థితులకు అనుగుణంగా చదివి రాణించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఎంఈవో రవీందర్‌రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దైవదీనం రెడ్డి, ఇండస్ స్కూల్ ప్రతినిధులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.