విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న ఈ సినిమా, ఆయన కెరీర్‌లో చివరిది కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల ప్రక్రియలో పలు అడ్డంకులు ఎదురయ్యాయని దర్శకుడు హెచ్. వినోద్ తెలిపారు.

సినిమా సెన్సార్ ఆలస్యమై పొంగల్ పండుగకు విడుదల కానప్పుడు, అలాగే సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయి పైరసీ బారిన పడినప్పుడు తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని వినోద్ చెప్పారు. పైరసీని అరికట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం తనను మరింత బాధించిందని ఆయన పేర్కొన్నారు. ఆ క్లిష్ట సమయంలో విజయ్ తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని వివరించారు.

'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బాధపడకండి. మనసు బాగోలేకపోతే నాకు కాల్ చేయండి' అని విజయ్ తనకు భరోసా ఇచ్చారని వినోద్ గుర్తు చేసుకున్నారు. విజయ్ లేకపోయినా సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని వినోద్ వెల్లడించారు. 'జన నాయగన్' చిత్రం 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేక్ అని, అయితే కథలో మార్పులు చేసి 50 శాతం మాత్రమే అసలు కథను తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.