తెలంగాణ బీజేపీలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య నెలకొన్న విభేదాలకు తెరపడింది. పార్టీ అధిష్టానం పెద్దలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ చొరవ తీసుకుని ఈ ఇద్దరు నేతలను ఒకే చోట కూర్చోబెట్టి చర్చలు జరిపారు. పార్టీ ఆదేశాలను పాటించాలని, అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కలిసి పని చేయాలని అధిష్టానం కరాఖండిగా చెప్పింది.

గత కొంతకాలంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వీరిద్దరి అనుచరులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ వైరాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. ఈ పరిణామాలతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు, పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన శ్రేణుల్లో వ్యక్తమైంది.

పార్టీ కోసం గతాన్ని వదిలేయాలని సూచించడంతో ఇద్దరు నేతలు అంగీకరించారు.

అయితే, ఈ సయోధ్య కేవలం పార్టీ పెద్దల ముందు వరకే పరిమితమా లేక భవిష్యత్తులోనూ కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. ఇద్దరు నేతలు కలిసి ఒకే వేదికపై కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.