ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్‌-2లో భాగంగా పోర్ట్‌హిల్ వేదికగా స్కాట్లాండ్, కెనడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో 5,000వ మ్యాచ్ నమోదైంది. 1971లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన పోరుతో ఈ ఫార్మాట్ మొదలైంది.

ప్రారంభంలో వన్డేలు 60 ఓవర్ల ఫార్మాట్‌లో ఉండేవి. 1975, 1979, 1983 ప్రపంచకప్‌లు ఇదే పద్ధతిలో జరిగాయి. ఆ తర్వాత 1987 ప్రపంచకప్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్‌ను అమలులోకి తెచ్చారు.

మొదటి 1,000 వన్డేలు పూర్తి కావడానికి 24 ఏళ్ల సమయం పట్టింది. అయితే, ఆ తర్వాత కేవలం 31 ఏళ్లలోనే మొత్తం 5,000 మ్యాచ్‌ల మార్కును క్రికెట్ ప్రపంచం చేరుకుంది.

అత్యధిక వన్డేలు ఆడిన జట్టుగా టీమిండియా 1,050కు పైగా మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 1,000కు పైగా మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా, 970కి పైగా మ్యాచ్‌లతో పాకిస్థాన్ ఉన్నాయి. అత్యంత విజయవంతమైన జట్టుగా మాత్రం 6 ప్రపంచకప్‌లు, 600కు పైగా విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.