పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా సమాధానం ఇచ్చింది. ఇథనాల్ కలపని పెట్రోల్ ధర లీటరుకు రూ. 125 ఉండేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇథనాల్ మిశ్రమం వల్ల పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన తెలిపారు.
దేశంలో ప్రస్తుతం 20 కోట్ల ద్విచక్ర వాహనాలు, 3 కోట్ల నాలుగు చక్రాల వాహనాలు కలిపి మొత్తం 23 కోట్ల వాహనాలు ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా ఈ వాహనాలు E15 లేదా E20 పెట్రోల్‌తోనే నడుస్తున్నాయని, ఇంజిన్ సమస్యలు వస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని గడ్కరీ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కార్లు, బైక్ కంపెనీల సర్వీసింగ్ సెంటర్ల నుంచి సేకరించిన డేటాను ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో సర్వీసింగ్ చేసిన 2.84 కోట్ల వాహనాల్లో 1.5 కోట్ల వాహనాలు పాతవేనని ప్రభుత్వం తెలిపింది. ఈ వాహనాల్లో ఎక్కడా మైలేజ్ సమస్యలు గానీ, ఇంజిన్ దెబ్బతిన్న ఆనవాళ్లు గానీ లేవని డేటా ద్వారా స్పష్టమైంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన దిగుమతులకు ఎదురైన సవాళ్లను కూడా ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని మంత్రి వివరించారు.







